
జనం న్యూస్, ఏప్రిల్ 23, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :
కోరుట్ల మరియు మెట్పల్లి పట్టణాల్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పార్టీతరుపున సంపూర్ణ మద్దతు ప్రకటించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, ఈ సందర్బంగా ఈరోజు కార్మికులను కలిసి వారితో పాటు సమ్మె లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పూర్తిగా న్యాయమైనవని, ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటాలు దాటుతున్నాయని, కానీ చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి జీవో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామని, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అపాయింట్మెంట్ ఇస్తే ఆ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ కార్మికుల సమస్యలపై కనీస స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు.జీవో గెజెట్ ఇచ్చి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి వద్ద సమయం లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించిన ఆయన, నిరసనలు వ్యక్తం చేస్తున్న కార్మికులపై కేసులు నమోదు చేయడం, ధర్నా చేస్తున్న వారికి టెంట్లు కూడా ఏర్పాటు చేయనివ్వకపోవడం అన్యాయమని అన్నారు,ఆర్టీసీ కార్మికులకు 100 శాతం న్యాయం జరిగే వరకు తాను వారి పక్షాన పోరాటం కొనసాగిస్తానని ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ గారు స్పష్టం చేశారు