
జనం న్యూస్ ఏప్రిల్ 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ;అనకాపల్లి,వేసవి సెలవుల సమయంలో అనేక కుటుంబాలు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే నేపథ్యంలో, ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న కొన్ని దొంగతన ఘటనలను దృష్టిలో ఉంచుకుని, పోలీసులు ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే దొంగతనాలను పూర్తిగా నివారించవచ్చని ఆయన సూచించారు. ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన భద్రతా సూచనలు: ఇళ్లలో నగదు, బంగారం వంటి విలువైన వస్తువులు ఉంచకుండా, బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలి.ఊరికి వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందిస్తే, మీ ఇంటి వద్ద LHMS (Locked House Monitoring System) ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయబడుతుంది. మీ ప్రయాణ వివరాలను నమ్మకమైన పొరుగువారికి లేదా బంధువులకు తెలియజేయండి. ఇంటి తలుపులు, కిటికీలు సరిగా లాక్ చేశారో లేదో నిర్ధారించుకోండి. అవసరమైతే ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ లేదా అలారం వ్యవస్థలను ఉపయోగించండి.బ్యాంకులు, ఏటీఎంలు, బంగారు దుకాణాలు హై-క్వాలిటీ CCTV కెమెరాలను ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలి. ఏటీఎం సెంటర్ల వద్ద రాత్రి సమయాల్లో సెక్యూరిటీ గార్డులను తప్పనిసరిగా నియమించాలి. అనుమానాస్పద కదలికలు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బస్సులు, రైళ్లలో ప్రయాణించే సమయంలో మీ సామాన్లు, నగలు జాగ్రత్తగా చూసుకోవాలి. అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోకండి. ఇంటి బయట నిద్రించే వారు ఆభరణాలు ధరించకుండా ఉండటం మంచిది.ఏదైనా అనుమానం లేదా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే Dial 100 / 112 కు కాల్ చేయండి.ప్రజల సహకారం లేకుండా నేరాల నియంత్రణ సాధ్యం కాదు. మీ అప్రమత్తతే మీ ఆస్తికి రక్షణ. అని ఎస్పీతుహిన్ సిన్హా తెలిపారు