
జనం న్యూస్,ఏప్రిల్ 27,అచ్యుతాపురం:
అచ్యుతాపురం మండలం ఉప్పవరం గ్రామంలో ఉపాధి హామీ పనులు లేకపోవడంతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫిబ్రవరిలో ఒక వారం ఏప్రిల్ లో రెండు వారాలు పని పెట్టి అర్ధంతరంగా పనులు నిలిపేయడంతో ఉపాధి కూలీలు ఈరోజు అచ్యుతాపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఉప్పవరం గ్రామ మాజీ సర్పంచ్ చిన్ని శ్రీనివాసరావు,సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు మాట్లాడుతూ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టం ద్వారా పనైనా ఇవ్వాలి లేదా భృతి అయినా కల్పించాలని చట్టంలో ఉందని నేడు కేంద్ర ప్రభుత్వం 150 రోజులు పని కల్పిస్తామని హామీలు ఇస్తున్నది తప్ప ఆచరణలో 50 రోజుల కన్నా పనులు కల్పించడం లేదని, ఇప్పటికైనా ఉప్పవరం గ్రామంలో ఉపాధి పనులు వెంటనే ప్రారంభించి ఉపాధి కూలీలను ఆదుకోవాలని సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అనంతరం ఎంపీడీవో,ఉపాధి హామీ పథకం అధికారులు రెండు రోజుల్లో పనులు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో చిన్ని సోమేశ్వరరావు, కాయల సూర్యమని,సుధా తాతబ్బాయి ,సునీత, గండేపల్లి అప్పారావు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.