
జనం న్యూస్ ఏప్రిల్ 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కాలం ఎంత దూరం చేసినా పాఠశాల స్నేహాలను మాయ చేయలేదని మాడుగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు మరోసారి నిరూపించారు. 1985-86 విద్యా సంవత్సరానికి చెందిన పదవ తరగతి విద్యార్థులు మాడుగులపల్లి కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని నాలుగు దశాబ్దాల తర్వాత కలుసుకుని పాత జ్ఞాపకాలను మళ్లీ సజీవం చేసుకున్నారు.ఈ సందర్భంగా సమ్మేళన కోఆర్డినేటర్ కర్ర దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, నలబై వసంతాల తర్వాత మళ్లీ అందరం కలుసుకోవడం అపూర్వమైన అనుభూతి. పాఠశాల రోజుల్లోని నిరాడంబరమైన జీవితం, స్నేహబంధాలు ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటాయి” అని పేర్కొన్నారు.పూర్వ విద్యార్థులు తమ బాల్యస్మృతులను ఒకరికొకరు పంచుకుంటూ, అప్పటి తరగతి గదులు, ఆటపాటలు, గురువుల మార్గదర్శకత్వాన్ని స్మరించుకున్నారు. ఆ రోజుల్లో చేసిన అల్లరులు, సాధించిన విజయాలు గుర్తు చేసుకుంటూ అందరూ ఆనందంలో మునిగిపోయారు.కార్యక్రమంలో సంకలమద్ది జానకి రెడ్డి, సంకలమద్ది రఘుపతి రెడ్డి, అలుగుబెల్లి పద్మ, చింతకుంట్ల పద్మ, దర్శనం సైదులు, అలుగుబెల్లి వెంకట్ రెడ్డి, చిలుముల శ్రీనివాస్ రెడ్డి, పుట్టా సంజీవ రెడ్డి, చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, సంకలమద్ది నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.అనంతరం వారికి విద్యాబోధన చేసిన గురువులను ఘనంగా సన్మానించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గురువుల పట్ల కృతజ్ఞతాభావం వ్యక్తం చేస్తూ పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు.మొత్తం కార్యక్రమం ఆప్యాయత, అనుబంధం, స్మృతుల కలయికగా సాగి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి మధురానుభూతిని మిగిల్చింది.