
జనం న్యూస్, ఏప్రిల్ 28(జిల్లా ఇంచార్జ్ )హుజురాబాద్ నియోజకవర్గం
ఇల్లందకుంట మండలం లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇల్లంతకుంట అపర భద్రాదిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అధికారుల నిర్లక్ష్యంపై హనుమాన్ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. ఇల్లందకుంట చౌరస్తాలో భక్తులు నిరసన చేపట్టి, ఆలయ నిర్వహణలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు.భక్తులకు కనీస సౌకర్యాలు కూడా అందించడం లేదని, త్రాగునీటి వంటి ప్రాథమిక అవసరాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అనవసరంగా అధిక బిల్లులు చూపిస్తూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై వెంటనే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని భక్తులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో భక్తులు నిరసనను విరమించారు.
