
జనం న్యూస్ 30 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ;గద్వాల భరోసా కేంద్రం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గద్వాల భరోసా కేంద్రం ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రత లింగ సమానత్వం, పిల్లల విషయం లో తల్లి తండ్రుల పాత్ర, బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సదస్సులు గద్వాల ఇన్డోర్ స్టేడియం గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కళాశాలలో వరుసగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మహిళలు, పిల్లల భద్రతకు సంబంధించిన చట్టాలు, ప్రభుత్వ చర్యలను వివరించారు. పని ప్రదేశాల్లో విద్యాసంస్థల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే డయల్ 100 లేదా పోలీస్ శాఖను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని భరోసా ఇచ్చారు ప్రస్తుత సమాజంలో మహిళలు మరియు పిల్లలపై జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు పిల్లల భద్రతలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని, పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడటం, వారి కదలికలు, స్నేహాలు, ఆన్లైన్ కార్యకలాపాలపై అవగాహన కలిగి ఉండటం అవసరమని తెలిపారు. అలాగే పిల్లలు ఎదుర్కొనే ప్రతి సమస్యను తల్లిదండ్రులతో పంచుకునేలా నమ్మకం కల్పించాలని చెప్పారు. పిల్లలను అనుమానాస్పద వ్యక్తులతో ఒంటరిగా పంపకూడదని, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని హెచ్చరించారు చిన్నారుల రక్షణపై ప్రత్యేకంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించారు. సురక్షితమైన స్పర్శ (తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రేమపూర్వక స్పర్శ) గుడ్ టచ్ అని, అనుమతి లేకుండా అసౌకర్యం కలిగించే లేదా భయాన్ని కలిగించే స్పర్శ బ్యాడ్ టచ్ అని వివరించారు. అలాంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే చెప్పడం, మౌనంగా ఉండకూడదని, నమ్మకమైన పెద్దల సహాయం తీసుకోవాలని సూచించారు.
సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ఆన్లైన్ మోసాలు జరిగినప్పుడు వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాగే సమాజ అభివృద్ధికి లింగ సమానత్వం కీలకమని, మహిళలు–పురుషులు సమాన అవకాశాలు పొందేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత పెంపొందించడమే సమాజ అభివృద్ధికి పునాది అని తెలిపారు.బాల్య వివాహాలపై కూడా అవగాహన కల్పిస్తూ, 18 సంవత్సరాల లోపు వివాహాలు చట్టపరంగా నిషేధమని, ఇవి పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తాయని వివరించారు. బాల్య వివాహాలపై సమాచారం తెలిసిన వెంటనే 1098 హెల్ప్‌లైన్ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులు, మహిళల్లో భద్రత, చట్టాలపై అవగాహన పెంపొందించి, సురక్షిత సమాజ నిర్మాణానికి దోహదపడడమే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.