జనం న్యూస్ 18: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విద్యుత్తు స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి వేలాదిమంది విద్యుత్తు మీటర్ రీడింగ్ తీసే వర్కర్ల పొట్టలు కొడతారా ముఖ్యమంత్రి గారూ ఎ.పి విద్యుత్తు మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ఎస్.డి శివారెడ్డి మరియు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మండిపడ్డారు. సోమవారం ఉదయం డి.ఎన్.ఆర్ అమర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎ. పి విద్యుత్తు మీటర్ రీడర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం ) రాష్ట్ర ప్రధమ మహాసభ గోడ పత్రికలు విడుదల చేయడం జరిగింది. అనంతరం కె.ఎస్.డి శివారెడ్డి, బుగత అశోక్ మీడియాలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలోని ఎస్పిడిసిఎల్, సిపిడిసిఎల్, ఇపిడిసిఎల్ పరిధిలో సుమారు 4 వేల మంది విద్యుత్ మీటర్ రీడర్స్ గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారన్నారు. ప్రతి రోజూ ఇంటింటికి వెళ్లి కరెంట్ రీడింగ్ తీసి కన్స్యూమర్స్కు ఇవ్వటంతోపాటు సంస్థకు ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్నారన్నారు. విద్యుత్ సంస్థనే నమ్ముకుని ఎప్పటికైన సంస్థలోనే ఉద్యోగ భద్రత దొరుకుతుందని ఆశతో పని చేస్తున్న మీటర్ రీడింగ్ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి రీడర్ల ఉపాధి తీసేసి రోడ్డు పాలు చేయాలని దుర్మార్గపు ఆలోచనతో చాప కింద నీరులా వ్యవహరిస్తుందనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్క సర్వీసుకు కేవలం 3.60 పైసల పీసురేటుతో నెలకు 6 వేల నుండి 10 వేల రూపాయల లోపు మాత్రమే వేతనంతో పని చేస్తు వారి కుటుంబాలను పోషించుకుంటున్న చిరు వేతన జీవుల పై ఇలాంటి నిర్ణయాలు చేయడం చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో జీవనం గడుపుతూ ఏనాటికైనా సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని యాజమాన్యం పైన, ప్రభుత్వం పైన వివిధ రూపాలలో ఒత్తిడి తెస్తూ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. అనేక సంవత్సరాలుగా మీటర్ రీడర్స్ను ఐక్యం చేస్తూ వేతనాల పెంపుకోసం, ఉద్యోగ భద్రత కోసం యూనియన్ కృషి చేస్తున్నదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టికి మీటర్ రీడర్ల సమస్యలు తీసుకుపోవటం, ఉద్యోగ భద్రత కోసం సంప్రదింపులు, వినతులు, ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించటం జరిగిందన్నారు. రాబోయో కాలంలో మీటర్ రీడర్ల ఉద్యోగ భద్రత కోసం భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఫిబ్రవరి 19, 20 తేదీల్లో రాష్ట్ర మహాసభలు విజయవాడలో నిర్వహిస్తున్నామనీ తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే మహాసభలకు ఉమ్మడి 13 జిల్లాల నుండి, మూడు డిస్కంల నుండి సుమారు 1500 మంది మీటర్ రీడర్స్ ప్రతినిధులుగా హాజరవుతారనీ తెలిపారు. ఈ మహాసభలకు మీటర్ రీడర్స్ అందరూ వెళ్ళి జయప్రదం చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యచరణ రూపొందించుకోవడం కోసం సంసిద్ధం అవ్వాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాసరావు, పసుమర్తి శ్రీకాంత్ (ఎస్. కోట సబ్ డివిజన్), విజయనగరం సబ్ డివిజన్ నుంచి బాసిన దివాకర్, గోక రమణ, సువ్వాడ శ్రీను, బెల్లాన రాము, పట్నాయకుని సతీష్ కుమార్, ఎమ్.డి యాసిన్, బొట్ట జగదీష్, పి.ఎస్.ఎన్ భూషణరావు, కూనిబిల్లి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.