జనం న్యూస్ 19 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు 'రహదారి భద్రత ర్యాలీ'ని పట్టణంలోని కోట జంక్షన్ వద్ద ఫిబ్రవరి 18న ప్రారంభించి, ఆర్టీసి కాంప్లెక్సు వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ముఖ్యఅతిధిగా హాజరై, ర్యాలీ ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ - రహదారి భద్రత ప్రమాణాలు పాటించకుంటే ప్రమాదాలు జరుగుతాయన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. చాలా వరకు వాహనదారులు తమకు డ్రైవింగు చక్కగా వచ్చునని, తనకు ప్రమాదాలు జరగవన్న భావనతో ఉంటారన్నారు. హెల్మెట్ ధరించని కారణంగా ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై, ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. వాహనదారులు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాల నుండి బయటపడవచ్చునన్నారు. మైనర్లు ఎక్కువగా డ్రైవింగు చేసి, ప్రమాదాలకు గురవ్వడం లేదా ప్రమాదాలకు కారకులవుతున్నారన్నారు. 18సం.లు కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు త్వరగా ఉద్రేకానికి గురవుతారని, వాహనాలను కంట్రోల్ చేసే సామర్థ్యం ఉండదన్న కారణంగా ప్రభుత్వం వారికి లైసెన్సులు మంజూరు చేయడం లేదన్నారు. పిల్లల బాగు కోసం, వారి భవిష్యత్తుకు ఎంతో శ్రమించే తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ప్పటికీ తమ పిల్లలపై ఉన్న ప్రేమ కారణంగా మైనర్లకు వాహనాలను ఇచ్చి, వారిని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలన్నారు. ప్రతీ ఏడాది మన జిల్లాలో రహదారి ప్రమాదాల కారణంగా సుమారు 400మంది మరణిస్తుండగా, మరో 900 మంది గాయపడుతున్నారన్నారు. వాహనాలను నడుపుటలో నిర్లక్ష్యం కారణంగా ఏ తప్పుచేయని ఇతర వ్యక్తులు కూడా ప్రమాదాలకు గురై, దురదృష్టవసాత్తు ప్రాణాలు కోల్పోవడం లేదా గాయపడడం జరుగుతుందన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రోటరీ క్లబ్ వారు చక్కని కార్యక్రమాన్ని చేపట్టి, వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ర్యాలీని నిర్వహించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. రోటరీ క్లబ్ గవర్నరు డా. ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వాహనాలను నడుపుతున్నపుడు 14సెకన్లుపాటు నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదానికి గురవుతామన్నారు. కావున, ప్రతీ ఒక్కరూ వాహనాలను నడిపేటప్పుడు తప్పని సరిగా రహదారి భద్రత ప్రమాణాలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని ప్రజలను కోరారు. అనంతరం, ర్యాలీలో పాల్గొన్న యువతీ, యువకులు, ప్రజలతో ప్రమాణం చేయించి, భద్రత ప్రమాణాలు పాటిస్తామని, ఇతరుల భద్రతకు కూడా బాధ్యత వహిస్తామని ప్రమాణం చేసారు. పట్టణంలోని కోట జంక్షను వద్ద రహదారి భద్రత అవగాహన ర్యాలీని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ గవర్నరు డా.ఎం.వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్ వినోద్, డా. పద్మకుమారి, జాయింట్ సెక్రటరీ మంజుల, సూర్యలక్ష్మి, రాజేంద్ర కురుకు, లెక్చలర్ శ్రీకాంత్, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, సిఐలు ఎస్.శ్రీనివాస్, టి.శ్రీనివాసరావు, ఎవి లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, సూరినాయుడు మరియు ఇతర పోలీసు అధికారులు, ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్. వెంకట పద్మ నర్సింగు విద్యార్థులు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.