జనం న్యూస్ జనవరి 11 కరీంనగర్ రిపోర్టర్ కడారి అయిలయ్య
కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జంకె రాంచంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగిన టిపిటిఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు పదవి విరమణ వయసు పెంచాలనే యోచన మానుకుని నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయాలని కోరారు. ప్రధాన కార్యదర్శి వేల్పుల బాలయ్య మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ఇది గొడ్డలి పెట్టు లాంటిదని , గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించడం అనైతిక చర్య అని, ఇట్టి నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకుని నిరుద్యోగులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు అర్కాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత జీవన పరిమాణ రేటు పరిశీలిస్తే ప్రస్తుతం ఉన్న 61 సంవత్సరాల పదవి విరమణ వయసు సరిపోతుందని, కేవలం పదవి విరమణ బెనిఫిట్స్ అయినటువంటి గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్, జెడ్పి జిపిఎఫ్ ఫైనల్ పేమెంట్స్ చెల్లించలేకనే ఈ నిర్ణయం తీసుకునే ఆలోచన చేయడం విచారకరమని వెంటనే అట్టి నిర్ణయాన్ని మానుకోవాలని తెలిపారు.రాష్ట్ర కౌన్సిలర్ కోట రామస్వామి, రాష్ట్ర ఆడిట్ కమిటీ మెంబర్ జానకి దేవిలు మాట్లాడుతూ మార్చి 2024 నుండి రిటైర్ అయిన ఏ ఉపాధ్యాయునికి, ఉద్యోగికి ఎలాంటి పదవి విరమణ చెల్లింపులు చేయకపోవడం దురదృష్టకరమని, అది వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని, అనేక ఆరోగ్య సమస్యలను తెస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆశాస్త్రీయమైన పదవీ విరమణ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని నిరుద్యోగులకు చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీధర్, మర్రి అవినాష్, ఎన్. రామస్వామి, సిహెచ్ ఆంజనేయరావు, జిల్లా కార్యదర్శులు ఎన్.శ్రీనివాస్, జి. చంద్రమౌళి, పి. లక్ష్మి రాజం, కే తిరుపతి తదితర జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.