జనం న్యూస్,జనవరి 11, బోధన్ నియోజవర్గం
బోధన్ పట్టణంలో కామ్రేడ్ శావులం సాయిలు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. శనివారం రోజున కామ్రేడ్ శావులం సాయిలు 29వ వర్ధంతి బోధన్ పట్టణంలోని హెడ్ పోస్టు ఆఫీస్ వద్ద ప్రజాపంథా పార్టీ జెండా గద్దె వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి.మల్లేష్ మాట్లాడుతూ మహోన్నతమైన ఆశయాల సాధన కోసం పోరాడిన వ్యక్తి కామ్రేడ్ శావులం సాయిలు అని కొనియాడారు.రైతాంగ సమస్యలకై, వ్యవసాయ కూలీల కూలీ రేట్ల పెంపుదలకై, చక్కెర కర్మాగార భూములను ప్లాంటేషన్ కార్మికులకు ఇవ్వాలంటూ, నిజాంసాగర్ నీళ్ల కోసం, సింగూరు-నిజామాబాద్ హక్కు అంటూ నాడు పార్టీ చేసిన పోరాటాల్లో ఆయన చురుకైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన పోరాటాల స్ఫూర్తితో ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు వాగ్దానాల అమలుకై పోరాడుదామని మల్లేష్ పిలుపునిచ్చారు. ఆయన ఆశయాల సాధన కోసం పోరాటాలు నిర్వహించడమే ఆయనకు నిజమైన నివాళులు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పడాల శంకర్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి సీతారాం, ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ బోధన్ పట్టణ అధ్యక్ష,కార్యదర్శులు నాగమణి, బీపాషా బేగం, టీయూసీఐ జిల్లా నాయకులు రెహానా బేగం, బోధన్ పట్టణ నాయకులు ఇర్షాద్, పార్టీ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.