
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా లడ్డూ వేలంపాటలో పాల్గొన్న భక్తులు. రూ. 27,116కు లడ్డూను దక్కించుకున్న కొంతం సోదరులు. జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు 24-09-2026 మున్సిపల్ కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ప్రతిరోజు సాయంత్రం సాంప్రదాయ పద్ధతిలో భజన కార్యక్రమాలు, అడుగు భజనలు, ఇతర ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఎలాంటి డీజేలు, అనవసర హంగామాకు తావులేకుండా గణనాథుని నామస్మరణ, భజనలు, కీర్తనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం పట్టణౌలోనే ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న మట్టి గణనాథుడి లడ్డూ వేలంపాట, అనంతరం లడ్డూ ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెబ్బేరు పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద జరిగిన లడ్డూ వేలంపాటలో వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేలంపాటలో కొంతం రామేశ్వర్ రెడ్డి, కొంతం నరేందర్ రెడ్డి సోదరులు రూ. 27,116కు గణనాథుని లడ్డూను దక్కించుకున్నారు. అలాగే చిన్న లడ్డూను తొండ పరమేష్, కురుమూర్తి సోదరులు రూ. 7,116కు సొంతం చేసుకున్నారు. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం ప్రతిష్ఠించే మట్టి గణనాథుడికి పెబ్బేరు పట్టణంలో ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. నిత్యం పూజలు, భజనలు, దీపారాధనలు జరిగే పవిత్ర ఆలయ ప్రాంగణంలో గణనాథుడిని ప్రతిష్ఠించి, పూర్తిగా హిందూ సనాతన సంప్రదాయాలకు అనుగుణంగా నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ గణనాథుడి లడ్డూకు కూడా భక్తుల్లో ప్రత్యేక విశ్వాసం ఉంది. అందుకే హైదరాబాద్ నుంచి సైతం భక్తులు ప్రత్యేకంగా పెబ్బేరుకు వచ్చి లడ్డూ వేలంపాటలో పాల్గొనడం ఈ లడ్డూకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. లడ్డూ వేలంపాటలో విజేతలుగా నిలిచిన కొంతం రామేశ్వర్ రెడ్డి, నరేందర్ రెడ్డి సోదరులు, తొండ పరమేష్, కురుమూర్తి సోదరులను ఆలయ కమిటీ సభ్యులు, మారుతి భజన మండలి సభ్యులు శాలువాలతో సత్కరించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం గణనాథుని లడ్డూలను వారికి అందజేశారు. పెబ్బేరు పట్టణంలో భక్తి, సంప్రదాయం, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్న శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ గణనాథుని ఉత్సవాలు ప్రతి ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.