
జనం న్యూస్ | : చండీగఢ్‌లో పోలీసు బృందంపై కొందరు మహిళలు దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మణిమజ్రాలోని ఇందిరా కాలనీలో సెప్టెంబర్ 9న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకునేందుకు ఐటీ పార్క్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు బృందం కాలనీకి వెళ్లగా, అనుమానితుల బంధువులు అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడినట్లు సమాచారం. పోలీసు బృందంలో ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌తో పాటు మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో ముగ్గురు మహిళలు మహిళా కానిస్టేబుల్‌ను చుట్టుముట్టగా, వారిలో ఒకరు ఆమె జుట్టు పట్టుకుని లాగినట్లు వైరల్ వీడియోలో కనిపిస్తోంది. సుమారు ఒకటిన్నర నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ఇతర మహిళా కానిస్టేబుళ్లు తమ సహచరురాలిని స్థానిక మహిళల నుంచి విడిపించేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఐటీ పార్క్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ రోహ్తాష్ యాదవ్ స్పందిస్తూ.. సెప్టెంబర్ 9న రహస్య సమాచారం మేరకు అనుమానితులను పట్టుకునేందుకు పోలీసు బృందం ఇందిరా కాలనీకి వెళ్లిందని తెలిపారు. పోలీసులపై దాడికి సంబంధించిన ఘటనలో ముగ్గురు మహిళలను సీఆర్పీసీ 107/151 సెక్షన్ల కింద ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టారు.