
జనం న్యూస్ సెప్టెంబర్ 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి వేడుకలను బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్షులు కర్ర వేణుగోపాల్ ఆధ్వర్యంలో బాలాజీ నగర్ డివిజన్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని కేపీహెచ్బీ ధనలక్ష్మి సెంటర్ పార్క్లో నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ మొక్కలు నాటారు. అనంతరం కేపీహెచ్బీ బ్రాండ్ ఫ్యాక్టరీ రోడ్డులో ఉన్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహానికి వడ్డేపల్లి రాజేశ్వరరావు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను స్మరిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ రాజకీయాలకు విలువలు, సిద్ధాంతాలు, దేశభక్తితో కూడిన సేవా మార్గాన్ని చూపిన మహనీయుడని అన్నారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు అందాలనే అంత్యోదయ స్ఫూర్తి ఆయన ఆలోచనలకు ప్రధాన ఆధారమని పేర్కొన్నారు. దేశం కోసం, సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమం కోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి బీజేపీ కార్యకర్త ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పచ్చదనాన్ని పెంపొందించేందుకు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని వడ్డేపల్లి రాజేశ్వరరావు సూచించారు. ఈ కార్యక్రమంలో యోగేష్ ప్రభు, కూకట్ పల్లి నియోజకవర్గ ఓబీసీ మోర్చా కన్వీనర్ జి.వినోద్ కుమార్ గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు భగవంత్ రెడ్డి, సత్యనారాయణ, వరలక్ష్మి, సరస్వతి, ప్రేమ్ నాథ్, సూరిబాబు కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కి ఘనంగా నివాళులు అర్పించారు.