
జనం న్యూస్ | సెప్టెంబర్ 25: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా వెస్ట్‌లో డెలివరీ బాయ్‌ను సెక్యూరిటీ గార్డులు గుర్తింపు తనిఖీ కోసం అడ్డుకోవడంతో ఓ మహిళ హల్చల్ చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆమ్రపాలి సెంచురియన్ పార్క్ టెర్రేస్ హోమ్స్ సొసైటీలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. వివరాల ప్రకారం.. ఓ మహిళ ఆన్లైన్లో శానిటరీ ప్యాడ్స్‌తో పాటు ఆహార పదార్థాలను ఆర్డర్ చేసింది. వాటిని తీసుకుని సొసైటీకి వచ్చిన డెలివరీ బాయ్‌ను సెక్యూరిటీ గార్డులు సొసైటీ నిబంధనల ప్రకారం గుర్తింపు తనిఖీ కోసం అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన మహిళ అక్కడికి చేరుకుని గార్డులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. వివాదం తీవ్రరూపం దాల్చడంతో మహిళ గార్డులతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు అసభ్యకర భాష, కులాన్ని ఉద్దేశించిన అభ్యంతరకర పదాలు ఉపయోగించినట్లు గార్డులు ఆరోపించారు. అంతేకాకుండా ఓ గార్డును చెంపదెబ్బ కొట్టినట్లు, కుర్చీలో కూర్చున్న మరో గార్డును కాలితో తన్నేందుకు ప్రయత్నించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం ఘటనను అక్కడున్న ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్లో వీడియోగా చిత్రీకరించడంతో అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో మహిళ, సెక్యూరిటీ గార్డుల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే వీడియోలో కనిపిస్తున్న ఘటన, ఇరువర్గాలు చేస్తున్న ఆరోపణల్లో పూర్తి వాస్తవాలు ఏమిటన్నది పోలీసుల దర్యాప్తు అనంతరం తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా, మహిళ మద్యం సేవించి ఉన్నారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు సొసైటీకి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. డెలివరీ బాయ్‌ను భద్రతా తనిఖీ కోసం నిలిపివేయడంతోనే వివాదం ప్రారంభమైనట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వైరల్ వీడియోతో పాటు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.