
జనం న్యూస్ సెప్టెంబర్ 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో కొలువుదీరిన శ్రీ బొజ్జ గణపయ్య (బీజేపీ గణేష్) స్వామివారి మహా లడ్డు ప్రసాదం 2026 సంవత్సరానికి గాను రికార్డు స్థాయిలో వేలం పాటలో దక్కింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు రూ .7,00,116/-లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు. 11 రోజుల పాటు ఎంతో నిష్టగా, భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు ప్రసాదాన్ని ఈ ఏడాది రికార్డు స్థాయి ధరకు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. గతంలో ఉన్న వేలం రికార్డులను అధిగమిస్తూ రూ .7,00,116/-లకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న వడ్డేపల్లి రాజేశ్వరరావు ఈ అవకాశాన్ని స్వామివారి ఆశీస్సులుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ. 51 సంవత్సరాలుగా కూకట్పల్లి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఎంతో భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న నిర్వాహకులు నాయినేని సూర్యప్రకాష్ రావు, అద్వాని సూర్యారావు, చౌదరి సూర్యారావు, జలంధర్ రావులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అర్ధ శతాబ్దానికి పైగా భక్తి, సంప్రదాయం, సేవా భావాలతో వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కల్పిస్తున్న నిర్వాహకుల సేవలు అభినందనీయమని అన్నారు. గణనాథుని సేవలో భాగంగా లడ్డు ప్రసాదాన్ని వేలం ద్వారా దక్కించుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ సంవత్సరం బొజ్జ గణపయ్య మహా లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. స్వామివారి కృపకు పాత్రుడిగా ఈ పవిత్ర ప్రసాదాన్ని దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, శ్రీ బొజ్జ గణపయ్య ఆశీస్సులు కూకట్పల్లి ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు వడ్డేపల్లి రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఈ లడ్డు ప్రసాదం ద్వారా భక్తి, సేవ, సౌభ్రాతృత్వం మరింత పెంపొందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ గణనాథుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వినాయక భక్త బృందం నిర్వాహకులు, సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.