
జనం న్యూస్ సెప్టెంబర్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పరకాల పట్టణంలో నూతనంగా నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓపీ వైద్య సేవలు శనివారం ప్రారంభమయ్యాయి హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయితో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఓపీ సేవలను ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో ఫార్మసీ, జనరల్ వార్డు, గైనకాలజీ, ఏఎన్సీ, ల్యాబొరేటరీ తదితర విభాగాలను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన రోగులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని కలెక్టర్ తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పరకాల పరిసర ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.ఆసుపత్రిలో ప్రస్తుతం 12 విభాగాల్లో సుమారు 27 మంది వైద్యులతో సేవలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించినప్పుడే ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ఆధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తోందని పేర్కొన్నారు.ఆసుపత్రికి అవసరమైన అదనపు వైద్య సదుపాయాలను తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పెండింగ్ బిల్లుల మంజూరుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. పరకాల ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి ఏ+ కేటగిరీకి తీసుకెళ్లేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ పవన్, ఆర్డీవో డీఎస్ వెంకన్న, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ, ప్రజాప్రతినిధులు, వైద్యులు, వైద్య సిబ్బంది, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.