
పొలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన. రైతులకు పంట రక్షణపై సూచనలు శాస్త్రవేత్తలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక సమీక్ష నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయాలి. రైతులకు తక్షణ సాంకేతిక సూచనలు అందించాలి జనం న్యూస్ సెప్టెంబర్ 28 కోటబొమ్మాళి మండలం :ఇటీవల జిల్లాలో తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన వరి పంటల పరిస్థితిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం, పంట పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయడంతో పాటు, పంటలను సాధ్యమైనంత మేరకు కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సంతబొమ్మాళి మండలంలోని హెచ్.ఎన్.పేట గ్రామంలో ముంపునకు గురైన వరి పొలాలను ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.వి. సత్యనారాయణ, వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత కొన్ని రోజులుగా వరి పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో పంటపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అధిక తేమ, నీటి నిల్వ కారణంగా తెగుళ్లు, ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటిమట్టం తగ్గిన వెంటనే పంట పరిస్థితిని బట్టి శాస్త్రీయ పద్ధతుల్లో పోషక యాజమాన్య చర్యలు చేపట్టాలని తెలిపారు. ముఖ్యంగా నత్రజని, పొటాషియం ఎరువులను పంట పరిస్థితిని బట్టి, వ్యవసాయ శాఖ మరియు శాస్త్రవేత్తల సూచనల మేరకే వినియోగించాలని రైతులకు సూచించారు. ముంపు అనంతరం పంటను పరిశీలించి అవసరమైన మేరకు అదనపు పోషక యాజమాన్యం, తెగుళ్లు మరియు చీడపీడల నివారణ చర్యలు చేపట్టాలని చెప్పారు. రైతులు స్వయంగా అధిక మోతాదులో ఎరువులు లేదా పురుగుమందులు వినియోగించకుండా, సమీప రైతు సేవా కేంద్రం లేదా వ్యవసాయ అధికారుల సలహా తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. నీరు పూర్తిగా తగ్గిన తర్వాత పంట వయస్సు, దెబ్బతిన్న స్థాయి, నేల పరిస్థితిని బట్టి తదుపరి చర్యలను నిర్ణయించాలని తెలిపారు. అవసరమైతే అందుబాటులో ఉన్న వ్యవసాయ డ్రోన్లను వినియోగించి ముంపు ప్రాంతాల్లో పంట పరిస్థితిని పరిశీలించడంతో పాటు, శాస్త్రవేత్తల సాంకేతిక సూచనల మేరకు అవసరమైన పోషక యాజమాన్యం, తెగుళ్లు, చీడపీడల నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతుకు నష్టం జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాకుండా, పంటను కాపాడుకునే అవకాశం ఉన్న ప్రతి పొలంలో శాస్త్రీయ పద్ధతులతో ముందస్తు చర్యలు చేపట్టాలి” అనే దిశగా వ్యవసాయ శాఖ పనిచేయాలని మంత్రి సూచించారు. బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయి పర్యటనలు మంత్రి సూచనల మేరకు వ్యవసాయ శాఖ జిల్లా యంత్రాంగం, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు బృందాలుగా ఏర్పడి ముంపు ప్రాంతాల్లో పర్యటించి రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని నిర్ణయించారు. ముంపు నీరు తగ్గిన తర్వాత ప్రతి పొలాన్ని పరిశీలించి పంట పరిస్థితిని బట్టి నీటి నిర్వహణ, పోషక యాజమాన్యం, తెగుళ్లు–చీడపీడల నివారణ, పంట పునరుద్ధరణ చర్యలపై రైతులకు స్పష్టమైన మార్గదర్శకాలు అందించనున్నారు. రైతులు కూడా తమ పొలాల్లో నీటి మట్టం తగ్గిన వెంటనే పంట పరిస్థితిని వ్యవసాయ అధికారులకు తెలియజేసి, వారి సూచనల మేరకు మాత్రమే ఎరువులు, పురుగుమందులు వినియోగించాలని అధికారులు సూచించారు.ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం, గుంటూరుకు చెందిన ఉపకులపతి డాక్టర్ పి.వి. సత్యనారాయణ, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అనకాపల్లికి చెందిన సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ సి.హెచ్. ముకుందరావు, నైరా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి. చిన్నమనాయుడు, ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ భాగ్యలక్ష్మి, రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ పి. ఉదయబాబు, ఆత్మ శ్రీకాకుళం పథక సంచాలకులు శ్రీ జగన్మోహన్రావు, టెక్కలి సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీ ఎన్. శ్రీనివాసరావు, సంతబొమ్మాళి మండల వ్యవసాయ అధికారి శ్రీ ఆర్. అప్పారావు, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, స్థానిక రైతులు పాల్గొన్నారు.