
జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్ 29 తర్లుపాడు గ్రామంలోని బీసీ ముదిరాజ్ కాలనీవాసుల తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. దాదాపు 12 ఏళ్లుగా వినియోగంలో లేక నిరుపయోగంగా ఉన్న బోరుకు కొత్త మోటారు, ప్యానెల్ బోర్డు ఏర్పాటు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయించారు.ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు కాలంగి శ్రీనివాసులు మాట్లాడుతూ, బీసీ ముదిరాజ్ కాలనీలో చాలాకాలంగా బోరు నిరుపయోగంగా ఉండటంతో కాలనీవాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల సమస్యను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి కొత్త మోటారు, ప్యానెల్ బోర్డు ఏర్పాటు చేయించడం అభినందనీయమన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే ఎల్లప్పుడూ ముందుండాలని ఆకాంక్షించారు. బోరు తిరిగి అందుబాటులోకి రావడంతో కాలనీవాసుల తాగునీటి కష్టాలు తీరాయని పేర్కొన్నారు.అనంతరం టీడీపీ నాయకులు కాలంగి శ్రీనివాసులు, ఈర్ల తిరుపతయ్య కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్యానెల్ బోర్డును స్విచ్ ఆన్ చేసి బోరు నుంచి నీటిని విడుదల చేశారు. నీరు రావడంతో కాలనీవాసులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల పెద్ద కాశయ్య, భీమనబోయిన వెంకటనారాయణ, భీమనబోయిన శ్రీను, ఈర్ల శివయ్య, డి. నాగేశ్వరరావు, పొన్నర్స్ సంజు, ఎస్. శ్రీను, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.