
అచ్చెన్నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న నాయకులు, కార్యకర్తలు జనం న్యూస్ , సెప్టెంబర్ 29 కోటబొమ్మాళి మండలం :వైకాపాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కోటబొమ్మాళి మండలం చిట్టివలస పంచాయతీ చవితిపేట గ్రామానికి చెందిన సుమారు 60 మంది వైకాపా నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. అంపోలుపాపారావు, రామినాయుడు, కృష్ణమూర్తి, కె. బయన్నకూర్మారావు, హనుమంతు సత్యం, మామిడి కృష్ణ తదితరులకు మంత్రి అచ్చెన్నాయుడు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ టీడీపీ, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే తాగునీటి పనులు సుమారు 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. గ్రామంలో పర్యటిస్తా “వచ్చే వారం, పది రోజుల్లో గ్రామానికి స్వయంగా వచ్చి ప్రజలను కలుసుకుంటా. స్థానిక సమస్యలను తెలుసుకుని, రాబోయే ఆరు నుంచి ఏడు నెలల్లో మంచి వాటర్ ట్యాంక్ నిర్మించడంతో పాటు ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటా” అని మంత్రి హామీ ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదని, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయడమే ప్రజాప్రతినిధుల బాధ్యత అని అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో పీఎసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివర ప్రసాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.