
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం సెప్టెంబర్ 30. 09. 2026
జహీరాబాద్ నియోజకవర్గంలో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను వెంటనే తెరవాలి: వై. నరోత్తం జహీరాబాద్ నియోజకవర్గంలో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం వెంటనే తెరిపించి చెరుకు రైతులకు భరోసా కల్పించాలని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై. నరోత్తం డిమాండ్ చేశారు. చెరుకు రైతులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రభుత్వం టన్ను చెరుకుకు రూ.5,500 ధర నిర్ణయించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుతం ఒక టన్ను చెరుకు పండించేందుకు రైతుకు సుమారు రూ.3,500 వరకు ఖర్చవుతోందని, పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. షుగర్ ఫ్యాక్టరీల యజమాన్యాలు రైతులతో వెంటనే సమావేశం నిర్వహించి ఫ్యాక్టరీలను ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టమైన తేదీ ప్రకటించాలని, రైతులకు ముందుగానే భరోసా కల్పించాలని వై. నరోత్తం కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలన్నింటినీ తెరిపిస్తామని హామీ ఇచ్చిందని, అయితే ప్రభుత్వం ఏర్పడి కాలం గడుస్తున్నా కొన్ని ఫ్యాక్టరీలు ఇప్పటికీ తెరుచుకోకపోవడం వల్ల చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులు పండించిన చెరుకును ఎక్కడికి తరలించాలి, ఎప్పుడు ఫ్యాక్టరీలు ప్రారంభమవుతాయి అనే విషయాలపై ప్రభుత్వం, కంపెనీ యజమాన్యాలు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి షుగర్ ఫ్యాక్టరీల ప్రారంభ తేదీలను ప్రకటించాలని, టన్ను చెరుకుకు రూ.5,500 ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని వై. నరోత్తం కోరారు. ఈ కార్యక్రమంలో షికారి గోపాల్, కుప్ప నగర్ శంకర్, మాజీ సర్పంచ్ స్వామిదాస్, ఈశ్వరప్ప, రామచందర్ రెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.