
జనం న్యూస్ అక్టోబర్ 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి అంతర్జాతీయ అబాకస్ పోటీలో శ్రీ చాణక్య అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయం సాధించడం ఎంతో గర్వకారణమని టిపిసిసి వైస్ ప్రెసిడెంట్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ అన్నారు. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అంతర్జాతీయ అబాకస్ పోటీలో విజయం సాధించిన శ్రీ చాణక్య అకాడమీ విద్యార్థులను బండి రమేష్ ఘనంగా సన్మానించి, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, కేవలం 8 నిమిషాల్లో 200 గణిత సమస్యలను వేగంగా, ఖచ్చితంగా పూర్తి చేసి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం విద్యార్థుల ఏకాగ్రత, పట్టుదల, ప్రతిభకు నిదర్శనమని అన్నారు. చిన్న వయసులోనే ఇంతటి ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయమని, విద్యార్థుల విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ట్రైనర్ల కృషి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ పోటీలో టి. లాలిన్ హరివంశ్ ప్రథమ బహుమతి, ఎ. శ్రీయాన్ష్ మరియు కె. జేష్విక ఐరా ద్వితీయ బహుమతులు సాధించారు. ట్రైనర్ చంద్రిక ఐనాపూడి మార్గదర్శకత్వంలో విద్యార్థులు ఈ ఘన విజయాన్ని సాధించారు. విద్యార్థులు సాధించిన ఈ విజయం కూకట్పల్లి ప్రాంతానికి గర్వకారణమని, భవిష్యత్తులో కూడా వారు మరిన్ని విజయాలు సాధించి దేశానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని బండి రమేష్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె శివ, శ్రీనివాస్, వాజిద్ పాషా, పులి శివకుమార్ గౌడ్, రామారావు, పాల్గొని విజేతలను అభినందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.