
జనం న్యూస్ అక్టోబర్ 3 కోటబొమ్మాళి : టెక్కలి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలో తొలి స్థానంలో నిలపాలన్న బలమైన సంకల్పం. పల్లె ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్న తపన. స్థానిక అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను తీర్చిదిద్దే ముందుచూపు.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషితో నరసింగపల్లిలో నిర్మించనున్న విద్యుత్ సబ్‌స్టేషన్ ఈ లక్ష్యాలకు కార్యరూపంగా నిలుస్తోంది. నియోజకవర్గ ప్రగతికి సారథ్యం వహిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఆయన మరో కీలక అడుగు వేశారు.టెక్కలి డివిజన్, కోటబొమ్మాళి సెక్షన్ పరిధిలోని నరసింగపల్లిలో రూ. 3.92 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. మంత్రి వర్యులు ప్రత్యేక కృషితో మంజూరైన ఈ ప్రాజెక్టు పరిధిలోని ఏడు గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించనుంది. పల్లెల అభివృద్ధికి అత్యవసరమైన విద్యుత్ మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తూ, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో మంత్రి చొరవ స్పష్టంగా కనిపిస్తోంది.గ్రామీణ జీవనానికి, వ్యవసాయ కార్యకలాపాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ఎంతో కీలకం. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని నరసింగపల్లి ప్రాంతానికి సబ్‌స్టేషన్ మంజూరయ్యేలా అచ్చెన్నాయుడు చేసిన కృషి పల్లె ప్రగతిపై ఆయనకున్న శ్రద్ధకు నిదర్శనం. అభివృద్ధి ఫలాలు గ్రామస్థాయికి చేరాలన్న లక్ష్యానికి ఈ ప్రాజెక్టు బలమైన పునాది కానుంది. ఏడు గ్రామాల ప్రజలకు ఉపయోగపడే విద్యుత్ సదుపాయం కల్పించడం ద్వారా స్థానిక అవసరాలను అభివృద్ధి ప్రణాళికలో ముందుంచిన నాయకుడిగా ఆయన తన ప్రత్యేకతను చాటుతున్నారు.నూతన సబ్‌స్టేషన్‌లో 5 ఎంవీఏ సామర్థ్యం కలిగిన పవర్ ట్రాన్స్ఫార్మర్, 6.13 కిలోమీటర్ల 33 కేవీ లైన్, 1.92 కిలోమీటర్ల 11 కేవీ లైన్ ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు ఒక ఎల్వీ వీసీబీ, మూడు ఫీడర్ వీసీబీలు, మూడు 11 కేవీ ఫీడర్లను సమకూర్చనున్నారు. ఈ ఏర్పాట్లు స్థానిక విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేసి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడనున్నాయి.విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గం కూడా ఉండేలా ప్రణాళిక రూపొందించారు. నరసన్నపేట సబ్‌స్టేషన్ నుంచి ప్రత్యేక 33 కేవీ ఫీడర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు, టెక్కలి,కోటబొమ్మాళి ఫీడర్‌కు నిమ్మాడ 33/11 కేవీ సబ్‌స్టేషన్ వద్ద ట్యాప్ చేసి ప్రత్యామ్నాయ 33 కేవీ ఫీడర్‌ను నిర్మించనున్నారు. ఈ సదుపాయాలతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు అవకాశం కలగనుంది. ప్రధాన సరఫరాతోపాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం ఈ ప్రాజెక్టులో కీలక అంశం.టెక్కలి నియోజవర్గాలపరిధిలో గ్రామాల అభివృద్ధే పునాది అన్న దిశగా అచ్చెన్నాయుడు చేస్తున్న కృషిలో నరసింగపల్లి సబ్‌స్టేషన్ ఒక ముఖ్యమైన ముందడుగు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలన్న ఆశయానికి, ప్రజల దైనందిన అవసరాలు తీర్చే మౌలిక వసతుల కల్పనకు ఈ శంకుస్థాపన అనుసంధానంగా నిలుస్తోంది. ఏడు గ్రామాలకు మెరుగైన విద్యుత్ సదుపాయం అందించే ఈ ప్రాజెక్టు, టెక్కలి నియోజకవర్గంప్రగతిపట్ల అచ్చెన్నాయుడు నిబద్ధతకు, అభివృద్ధిని సాధించే ఆయన చొరవకు నిదర్శనం. 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుతో పరిసర ప్రాంతాల్లోని చిన్నతరహా పరిశ్రమలకు మరింత ప్రయోజనం చేకూరడంతోపాటు, విద్యుత్ సరఫరా నిరంతరాయంగా అందుతోంది. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడుతున్నాయి.మూడు నుంచి నాలుగు నెలల కాలవ్యవధిలో ఈ నూతన సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తికానుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అనుకున్న గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసి, సబ్‌స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.