
మోతీనగర్‌లో క్షేత్రస్థాయిలో పరిశీలన. అధికారులకు కీలక సూచనలు జనం న్యూస్ : అక్టోబర్ 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మూసాపేట డివిజన్ మోతీనగర్‌లోని వార్డు కార్యాలయంలో శనివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓటరు జాబితా పరిశీలన, నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఓటరు జాబితా పరిశీలనలో భాగంగా నోటీసులు అందిన ప్రతి ఓటరుకు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ఏ ఒక్కరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఓటర్లకు అందుబాటులో ఉంటూ అవసరమైన వివరాలు, పత్రాల విషయంలో బూత్ స్థాయి అధికారులు ప్రజలకు సహకరించాలని అన్నారు. ఓటు ప్రతి పౌరుడికి ఎంతో కీలకమైన హక్కు అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. ప్రజలు ఓటరు జాబితాను నిర్లక్ష్యం చేయకుండా కొద్ది సమయం కేటాయించి తమ పేరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కోరారు. కబీర్ నగర్లో సామాజిక భవనం ప్రారంభం అనంతరం మోతీనగర్ పరిధిలోని కబీర్ నగర్లో మహిళల విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేసిన సామాజిక భవనాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. స్థానికుల అవసరాలకు అనుగుణంగా సామాజిక కార్యక్రమాలకు ఈ భవనం ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష అనంతరం మోతీనగర్ ప్రాంతంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రామారావు నగర్ నుంచి కబీర్ నగర్ వరకు చేపడుతున్న నాళా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మోతీనగర్‌లో చేపట్టాల్సిన మధ్య విభజన పనులను కూడా వెంటనే ప్రారంభించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న రహదారులు, మురుగునీటి కాలువలకు సంబంధించిన పనులను ఆలస్యం చేయకుండా చేపట్టాలని ఎమ్మెల్యే అన్నారు. అభివృద్ధి పనులు ఆలస్యం కావడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు మౌలిక వసతుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రహదారులు, మురుగునీటి కాలువలు, నాళాలు, మధ్య విభజనలు తదితర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మూసాపేట మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, జోసఫ్, తిరుపతి, రాజ్‌కుమార్ గౌడ్, ఉదయ్ వినోద్, వెంకట్ రెడ్డి, మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, అశోక్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.