
ప్రభుత్వ భూములు అమ్మరాదు, కొనరాదు - కొనేవారు మోసపోవద్దు: సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ హెచ్చరిక జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం సంగారెడ్డి, అక్టోబర్ 3: సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు, రైతులకు ఇచ్చిన ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులు లీజు పేరుతో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని, దీనివల్ల అమాయక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు, సీలింగ్ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మరాదు, కొనరాదు అని ప్రభుత్వం ఎప్పుడో స్పష్టంగా ప్రకటించిందని గుర్తు చేశారు. లీజు ముసుగులో మోసం: కానీ జిల్లాలోని పలు మండలాల్లో కొందరు దళారులు, భూములు పొందిన లబ్ధిదారులు "లీజు పర్పస్" అనే ముసుగులో రిజిస్ట్రేషన్ లేకుండా, అగ్రిమెంట్ల పేరుతో ఎకరాలకు ఎకరాలు అమ్మేస్తున్నారని ఆరోపించారు. ఈ భూములను నమ్మి కొనుగోలు చేసే రైతులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి, తీరా రెవెన్యూ రికార్డుల్లో వారి పేరు రాకపోవడంతో మోసపోతున్నారని తెలిపారు. "ప్రభుత్వ భూమి కొన్న రైతుకు ఎప్పటికీ పట్టా రాదు, బ్యాంకు లోన్ రాదు, రైతుబంధు, రైతు భీమా కూడా రాదు. చివరకు ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకుంటే కొన్నవాడు రోడ్డున పడతాడు. ఇది ముమ్మాటికీ అమాయక రైతులను మోసం చేయడమే" అని బాలరాజ్ అన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: ఇలాంటి అక్రమ లీజు అమ్మకాలపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు వెంటనే దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలంలో ప్రభుత్వ భూముల అమ్మకాలు, కొనుగోళ్లపై విచారణ జరిపి, రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రభుత్వ భూములు కొనవద్దని, ఎవరైనా లీజు పేరుతో అమ్మజూపితే మోసపోవద్దని జిల్లా రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు.