
పక్క రాష్ట్రాల మేస్త్రీలు బిల్డర్ల పై స్థానిక కార్మికుల ఆగ్రహం జనం న్యూస్- అక్టోబర్ 8- నాగార్జునసాగర్ టౌన్- నందికొండ మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణ రంగంలో ఉపాధి పొందుతున్న స్థానిక కార్మికుల పరిస్థితి రోజురోజుకు అగమ్య గోచరంగా మారుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ కూలీకి కార్మికులను తీసుకువచ్చి పనులు చేస్తూ ఉండడంతో తమకు పనులు దొరకక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానిక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు తమ స్వలాభం కోసం పక్కనే ఉన్న ఆంధ్రా నుంచి కార్మికులను తెప్పించి పనులు చేయిస్తూ స్థానికులకు పనులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి నందికొండ మున్సిపాలిటీ పరిధిలోనే భవన నిర్మాణ పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామని కానీ ప్రస్తుతం కాంట్రాక్టర్ల తీరు వల్ల పనులు దొరకడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికులకు ఎలాంటి గుర్తింపు కార్డులు వివరాలు సేకరించకుండానే కాంట్రాక్టర్లు తమ స్వలాభం కోసం పనుల్లో పెట్టుకుంటున్నారని స్థానిక కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నారు. కార్మిక శాఖ నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లు స్థానికత ప్రాధాన్యత ప్రకారం స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించాలని కానీ ఈ నిబంధనలను నందికొండలో పూర్తిగా గాలికి వదిలేసారని విమర్శిస్తున్నారు.
నందికొండ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ప్రతినిర్మానంలో స్థానిక భవన నిర్మాణ కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇతర రాష్ట్ర కార్మికులను పిలిపించే కాంట్రాక్టర్లపై కార్మిక శాఖ అధికారులు నిఘా ఉంచాలి. కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి అని ఈ సందర్భంగా వారు కోరారు. తక్షణమే సంబంధిత అధికారులు మున్సిపల్ పాలకవర్గం స్పందించి స్థానిక భవన నిర్మాణ కార్మికుల ఉపాధికి భరోసా కల్పించాలని నందికొండ మున్సిపాలిటీ భవన నిర్మాణ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. స్థానికంగా ఉన్న నందికొండ భవన నిర్మాణ కార్మికుల యూనియన్ నాయకులకు సంప్రదించకుండానే దైవ జ్ఞాన సిలువ కేంద్రం లో జరుగుతున్న అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.సమస్య పరిష్కారం కాకపోతే నందికొండ మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని నాగార్జునసాగర్ భవన నిర్మాణ కార్మికుల యూనియన్ ప్రెసిడెంట్ నాని, వల్లెపు నాగార్జున (సిపిఐ పట్టణ కార్యదర్శి), ఏఐటియుసి భవన నిర్మాణ కార్యదర్శి హరిచంద్ నాయక్, వల్లెపు రామకృష్ణ, ఇబ్రహీం, సాగర్ మరియు భవన నిర్మాణ కార్మికులు డిమాండ్ చేశారు.