
లయన్స్ క్లబ్ ఆఫ్ కూకట్పల్లి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జనం న్యూస్, అక్టోబర్ 9 | తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి: శ్రీనివాస్ రెడ్డి దసరా పండుగను పురస్కరించుకొని నిరుపేద పిల్లల జీవితాల్లో ఆనందాన్ని నింపాలనే సదుద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ కూకట్పల్లి ఆధ్వర్యంలో వస్త్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కూకట్పల్లిలోని రాజేశ్వరి వృద్ధాశ్రమంలో ది చెన్నై సిల్క్స్ వారి సహకారంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమంలో పేద పిల్లలకు వస్త్రాలను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కూకట్పల్లి అధ్యక్షుడు లయన్ యక్కంటి వెంకటరెడ్డి, క్లబ్ సభ్యులు, రాజేశ్వరి వృద్ధాశ్రమ నిర్వాహకురాలు రాజేశ్వరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పండుగలు కేవలం ఆనందాలకే పరిమితం కాకుండా, సమాజంలోని నిరుపేదలకు అండగా నిలవడానికి కూడా ఒక మంచి అవకాశమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పండుగ సంతోషాలకు దూరం కాకుండా పేద పిల్లలు సైతం కొత్త వస్త్రాలు ధరించి దసరా పండుగను ఆనందంగా జరుపుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మానవత్వమే నిజమైన సేవ ఈ సందర్భంగా లయన్ యక్కంటి వెంకటరెడ్డి మాట్లాడుతూ, పండుగలు ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాన్ని నింపడంతో పాటు, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే మానవత్వాన్ని గుర్తుచేస్తాయని అన్నారు. నిరుపేద పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చూడటం ఎంతో సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ లయన్స్ క్లబ్ ఆఫ్ కూకట్పల్లి ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సేవా కార్యక్రమానికి సహకారం అందించిన ది చెన్నై సిల్క్స్యా జమాన్యానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయూతనందించేందుకు దాతలు, సేవా సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పండుగ వేళ పేద పిల్లలకు వస్త్రాలు అందించడం ద్వారా వారి కుటుంబాల్లో ఆనందాన్ని పంచుతూ, సేవాభావం మరియు సామాజిక బాధ్యతకు లయన్స్ క్లబ్ ఆఫ్ కూకట్పల్లి ప్రతీకగా నిలిచింది.