
జనం న్యూస్, అక్టోబర్ 13, అచ్యుతాపురం : అర్నాబ్ తుఫాను కారణంగా నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను తక్షణమే పంపిణీ చేయాలని మత్స్యకార సంక్షేమ సమితి నాయకులు కోరారు. తుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం బియ్యం, నిత్యావసర సరుకులు అందిస్తామని ప్రకటించినప్పటికీ, నేటి వరకు వాటి పంపిణీ జరగలేదని వారు పేర్కొన్నారు. దీంతో మత్స్యకార కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్‌ను, మత్స్యశాఖ సూపరింటెండెంట్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రకటించిన హామీ మేరకు ప్రతి అర్హత కలిగిన మత్స్యకార కుటుంబానికి 50 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను ఆలస్యం చేయకుండా పంపిణీ చేయాలని వినతిపత్రంలో కోరారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, అర్హులైన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకార సంక్షేమ సమితి ప్రతినిధులు మేరుగు రాజారావు, మేరుగు నూకరాజు, పిరాది వసంతరావు, గనగళ్ల కాసుబాబు తదితరులు
విజ్ఞప్తి చేశారు.