జనం న్యూస్ అక్టోబర్ 13, (పరిగి నియోజకవర్గం ఇంచార్జి ) వికారాబాద్ జిల్లా ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సమావేశం వికారాబాద్ జిల్లా ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్, పట్నం నరేందర్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వికారాబాద్ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక జిల్లా ఏర్పాటు కలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తొలి తెలంగాణ ప్రభుత్వం సాకారం చేసిందని గుర్తు చేశారు. జిల్లా ఏర్పాటు కోసం గతంలో ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు, పోరాటాలు చేసినప్పటికీ వారి ఆకాంక్ష నెరవేరలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్, ప్రజల అవసరాలను, ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేశారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వికారాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పునాది వేసిందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వికారాబాద్ జిల్లాలో కొత్త అభివృద్ధి పనులు చేపట్టడం లేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరై ప్రారంభించిన పనులనే తిరిగి ప్రారంభిస్తూ అభివృద్ధి జరుగుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. వికారాబాద్ జిల్లా ఏర్పాటుతో పాటు జిల్లా అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.