
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్జ జనం న్యూస్ అక్టోబర్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ, ప్రకృతితో మానవ జీవనానికి ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే పూల పండుగ బతుకమ్మ అని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే ఈ పండుగకు తెలంగాణ సంస్కృతిలో విశిష్టమైన స్థానం ఉందని ఆయన అన్నారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలు సంప్రదాయబద్ధంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకల్లో సీపీ డా. ఎం. రమేష్ పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనరేట్ ప్రాంగణం పూల సోయగాలతో కళకళలాడింది. వివిధ రకాల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ వేడుకలను వైభవంగా నిర్వహించారు. తెలంగాణ మహిళల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే పాటలు, సంప్రదాయ ఆటలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీసు అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొనడంతో కమిషనరేట్ ప్రాంగణంలో పండుగ సందడి నెలకొంది. ఈ సందర్భంగా సీపీ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ కేవలం పూలతో నిర్వహించే వేడుక మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, మహిళల ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అని పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రకృతిని గౌరవించడం, పూల ప్రాధాన్యతను గుర్తించడం, కుటుంబ సభ్యులు, సమాజంలోని ప్రజలు కలిసి ఆనందాన్ని పంచుకోవడం బతుకమ్మ పండుగ ప్రత్యేకతలని వివరించారు. తెలంగాణ అస్తిత్వాన్ని, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే బతుకమ్మ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ద్వారా మన మూలాలను కాపాడుకోవచ్చని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళల భాగస్వామ్యంతో నిర్వహించే ఇలాంటి పండుగలు సమాజంలో ఐక్యతను, సోదరభావాన్ని మరింత పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, క్రైమ్ డీసీపీ పుష్ప, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిణి రెడ్డి, షీ టీమ్స్ డీసీపీ సృజన, హెడ్క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, ఏవో జ్యోతిర్మయితో పాటు పలువురు పోలీసు అధికారులు, కమిషనరేట్ కార్యాలయ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రకృతి పరిమళాలు, సంప్రదాయ పాటలు, మహిళల సందడితో సాగిన బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి వైభవాన్ని మరోసారి చాటిచెప్పాయి.