
జనం న్యూస్ అక్టోబర్ 16, వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ బతుకమ్మ పాటలతో పండుగ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు పోలీస్ కార్యాలయంలో పండుగ వాతావరణాన్ని నింపాయి. పోలీస్ అధికారులు, మహిళా పోలీస్ సిబ్బంది, ఇతర సిబ్బంది సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ, ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, మాట్లాడుతూ, “బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి, పూల వైభవానికి ప్రతీక. మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు, వాటి గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రజల భద్రతకు నిరంతరం కృషి చేస్తున్న సిబ్బంది, ఇటువంటి పండుగల ద్వారా సంప్రదాయా లను గౌరవిస్తూ పరస్పర స్నేహభావం, ఐక్యతను మరింత పెంపొందించుకోవడం అభినందనీయమని” తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పే బతుకమ్మ వేడుకలు పోలీస్ కార్యాలయంలో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ముగిశాయి. ఇట్టి కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీన, , ఉమెన్ ఇన్స్పెక్టర్ ప్రమీల , ఇతర అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది.