
జనం న్యూస్ | సెప్టెంబర్ 21: రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ టికెట్ తనిఖీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఓ మహిళ.. తనపై సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆరోపించేందుకు తన బట్టలను తానే చించుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన సెప్టెంబర్ 17న దానాపూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో దానాపూర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ మధ్య చోటుచేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఓ చిన్నారితో కలిసి ప్రయాణిస్తున్న మహిళ తొలుత సెకండ్ క్లాస్ ఏసీ కోచ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రైలు దానాపూర్ నుంచి బయలుదేరిన అనంతరం టికెట్ తనిఖీ సిబ్బంది ప్రయాణికుల టికెట్లను పరిశీలించగా, మహిళ చెల్లుబాటు అయ్యే టికెట్ చూపించలేకపోయినట్లు తెలిపారు. దీంతో టికెట్ తీసుకోవాలని సిబ్బంది సూచించగా, ఆమె థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లోకి వెళ్లింది. అక్కడ కూడా టికెట్ చూపించాలని కోరగా, తాను డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని మహిళ చెప్పినట్లు, అయితే చెల్లుబాటు అయ్యే టికెట్ తప్పనిసరిగా ఉండాలని సిబ్బంది వివరించినట్లు వీడియోలో వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆమె సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పాటు, తన సోదరుడు కూడా టీటీఈగా పనిచేస్తున్నాడని చెప్పినట్లు వీడియోలో కనిపిస్తోంది. రైల్వే పోలీసుల హెల్ప్‌లైన్ కోసం ఫోన్లో వెతుకుతూ సిబ్బందిని ఇరికిస్తానని ఆమె హెచ్చరించినట్లు తెలుస్తోంది. అనంతరం ఒక్కసారిగా తన బట్టలను తానే చించుకున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ఘటనపై టీటీఈలు డివిజనల్ కంట్రోల్‌కు సమాచారం అందించగా, సాయంత్రం సుమారు 4 గంటలకు రైలు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ చేరుకున్న వెంటనే ఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మహిళను రైలు నుంచి దించి విచారించడంతో పాటు, ఘటనను రికార్డ్ చేసిన మరో ప్రయాణికుడు తన వద్ద ఉన్న వీడియోను రైల్వే సిబ్బందికి అందించారు. ఆ వీడియో ఆధారంగా కోచ్‌లో జరిగిన పరిణామాలను అధికారులు పరిశీలించారు. అనంతరం రైల్వే నిబంధనల ప్రకారం మహిళకు జరిమానా విధించి, టికెట్ జారీ చేసిన తర్వాత ప్రయాణించేందుకు అనుమతించినట్లు అధికారులు తెలిపారు. తనిఖీ సిబ్బంది మహిళతో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలను రైల్వే అధికారులు ఖండించారు. మొత్తం ఘటనకు సంబంధించి ప్రయాణికుడు తీసిన వీడియో కీలక ఆధారంగా మారిందని అధికారులు పేర్కొన్నారు.