

జనం న్యూస్ అక్టోబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమలాపురంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆయుధ పూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాష్ట్ర నాయకులు శిరంగు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి సుబ్రమణ్యం, ఉభయ జిల్లాల ప్రముఖులు కస్తూరి అఖిల్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆయుధాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కిరెడ్డి సుబ్రమణ్యం మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి దేశభక్తి, దైవభక్తితో హిందూ సమాజ సేవకు అంకితం కావాలన్నారు. హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. కస్తూరి అఖిల్ మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువతను ప్రతి గ్రామంలో తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో బజరంగ్ దళ్ కార్యక్రమాలు విస్తరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఊటుకూరి సాంబయ్య, యక్కల బ్రహ్మేష్, అడబాల నరేష్, భీమనాదం రవి, అప్పన రంగబాబు, గంగుమళ్ళ దొరబాబు, అలకా వాసు, విత్తనల శ్రీను, పసుమర్తి సుమన్, గ్రంధి సత్యం, ఆదుర్తి వెంకట ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.