
కాట్రేనికోన పీహెచ్సీ, గచ్చకాయపొర మెడికల్ క్యాంపు పరిశీలన - పది మంది గర్భిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు_

జనం న్యూస్ అక్టోబర్ 27: ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం. దుర్గారావు దొర ఈరోజు కాట్రేనికోన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. తుఫాన్ ముందస్తు చర్యల్లో భాగంగా పల్లం గ్రామం నుంచి వచ్చిన గర్భిణీ స్త్రీలను పరీక్షించి, వారికి అందించాల్సిన వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం గచ్చకాయపొర గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును పరిశీలించి, అక్కడ జరుగుతున్న వైద్య సేవల తీరును పర్యవేక్షించారు. తుఫాన్ నేపథ్యంలో అవసరమైన మందుల నిల్వలు, సిబ్బంది సంసిద్ధతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈరోజే పీహెచ్సీలో జనరేటర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాట్రేనికోన పరిధిలో పది మంది గర్భిణీ స్త్రీలను ముందస్తు చర్యగా సురక్షిత ప్రాంతాలైన పీహెచ్సీ, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ఎం. లిఖిత, డాక్టర్ పి. నీలిమ, సీహెచ్వో బులి శేషయ్య, వివిధ గ్రామాల వైద్య సిబ్బంది పాల్గొన్నారు.