
మూడేళ్లుగా తాళం వేసి ఉన్న ఆపరేషన్ థియేటర్.. ఆసుపత్రి నిర్వహణపై అసంతృప్తి
100 పడకల ఆసుపత్రిని వెంటనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి
అవసరమైన నిధులు మంజూరు చేసి పేదలకు మెరుగైన వైద్యం అందించాలి
జనం న్యూస్ | జగిత్యాల జిల్లా : కోరుట్లకోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, అక్కడి వైద్య సదుపాయాలు, నిర్వహణ, రోగులకు అందుతున్న సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు,కోరుట్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో, పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఆశయంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుతో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు గత ప్రభుత్వం కృషి చేసిందని గుర్తుచేశారు.కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. 100 పడకల ఆసుపత్రికి అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే సేవలు అందుతున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఆసుపత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ఉన్నప్పటికీ, దాదాపు మూడేళ్లుగా దానికి తాళం వేసి ఉండటం, తాళం చెవి అందుబాటులో లేకపోవడంతో తాళం పగలగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడాల్సిన కీలక వైద్య సదుపాయం నిరుపయోగంగా ఉండటం బాధాకరమన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, వైద్య సేవలపై తగిన శ్రద్ధ చూపడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజలకు అత్యవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కోరుట్ల ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులు మంజూరు చేసి, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో అందుబాటు లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా, కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్య సేవలు, అవసరమైన శస్త్రచికిత్సలు, వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల చేయడంతో పాటు, వైద్య సిబ్బంది, మౌలిక సదుపాయాలు, చికిత్సా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజల ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.