

జనం కష్టంలో జన నాయకుడు - వానలో తడిస్తూ బాధితులకు భరోసా ఇచ్చిన దాట్ల
జనం న్యూస్ అక్టోబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన: ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో అతలాకుతలమైన కాట్రేనికోన మండలం పల్లం, చిరయానం, బలుసుతిప్ప గ్రామాల్లో ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రతికూల వాతావరణంలోనూ పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. ప్రజల కష్టాల్లో అండగా నిలిచే నాయకుడిగా తుఫానును సైతం లెక్కచేయకుండా పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి సమస్యలు, ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు భోజనం, మంచినీరు, ఇతర వసతులు సక్రమంగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వారి పక్కనే ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన బాధ్యత అని చాటుకున్నారు. ఎవరూ అధైర్యపడవద్దని, కూటమి ప్రభుత్వం ప్రతి బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని, నష్టాల అంచనా వేసి త్వరలోనే న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇవ్వడంతో బాధితుల్లో ధైర్యం నెలకొంది. తుఫాను అంటే ఇంట్లో దాక్కునే నాయకులు ఉండగా, వానలో తడిస్తూ ప్రజల కోసం తిరుగుతున్న దాట్ల సుబ్బరాజు నిజమైన ప్రజా నాయకుడని స్థానికులు కొనియాడుతున్నారు. ఆయన వెంట టీడీపీ మండల ఇంచార్జ్ దాట్ల పవన్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు, దండుబోలు సత్యం, బొమ్మిడి లింగేశ్వరరావు తదితరులు ఉన్నారు.