
జనం న్యూస్ నవంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వరంగల్: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఓటరు జాబితాలో అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని తహసీల్దార్ రోకుల ప్రవీణ్ కుమార్ కోరారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన తెలిపారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి, నిర్దేశించిన అర్హత తేదీ నాటికి మూడేళ్లు పూర్తిచేసిన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. అర్హత కలిగిన వారు నిర్ణీత ఫారం–18లో పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తుతో పాటు అవసరమైన విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు పత్రాలను జతచేసి ఆన్లైన్లో లేదా సంబంధిత అధికారుల ద్వారా సమర్పించవచ్చని తెలిపారు. పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ముందుగా ఓటరు జాబితాలో పేరు నమోదు కావడం తప్పనిసరి అని పేర్కొన్నారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా అర్హులైన పట్టభద్రులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో కీలకమని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు తన పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవడంతో పాటు, పేరు లేని వారు వెంటనే నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని తహసీల్దార్ రోకుల ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.