
జనం న్యూస్, నవంబర్ 06, జగిత్యాల జిల్లా – మెట్పల్లి: మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన మోగిలిపాక రవి అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో, ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న సైనిక్ ఫౌండేషన్ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించారు. ఈ మేరకు ఫౌండేషన్ సభ్యులు బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. అంతేకాకుండా, కుటుంబానికి నెల రోజుల పాటు సరిపడా నిత్యావసర సరుకులను అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సైనిక్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు అరిగెల రాకేష్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం తమ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మోగిలిపాక రవి కుటుంబానికి భవిష్యత్తులో కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రంజిత్, జలంధర్, నరేష్, చిరు తదితరులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ సైనిక్ ఫౌండేషన్ సభ్యులు చూపిన మానవత్వం పలువురి ప్రశంసలు అందుకుంది.