
భూములపై అధికారిక సర్వే చేయించి బాధితులకు న్యాయం చేస్తాం – ఎమ్మెల్యే హామీ జనం న్యూస్ నవంబర్ 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్లో నెలకొన్న భూ వివాద సమస్యపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం స్వయంగా పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వివాదాస్పద భూముల పేరుతో కొందరు తమ ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారంటూ స్థానిక నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను సంప్రదించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే కృష్ణారావు సంబంధిత ప్రాంతాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గుట్టల బేగంపేట, అల్లాపూర్ గ్రామం, కూకట్పల్లి మండల పరిధిలోని ఈ భూములకు సంబంధించి ఓవర్‌ల్యాపింగ్ సమస్య ఉందని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ భూములకు సంబంధించి సరైన అధికారిక సర్వే జరగకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి సంబంధిత భూములకు అధికారికంగా సర్వే నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సర్వే ద్వారా వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకొచ్చి, అర్హులైన బాధిత నివాసితులకు ఎలాంటి అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలా కృషి చేస్తానని భరోసా కల్పించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్టబద్ధమైన పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మాజీ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌసిద్ధి, డివిజన్ అధ్యక్షులు ఐలయ్య, పిళ్లి తిరుపతి, సత్యం, బాబా, కళ్యాణ్ నాయక్, బద్దు నాయక్ తదితరులు పాల్గొన్నారు.