
ధాన్యం ధరలు తగ్గించి కొనుగోళ్లు. గిట్టుబాటు ధర కల్పించాలని తహసీల్దార్‌కు వినతి జనం న్యూస్ నవంబర్ నవంబర్ 11:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రం లో మిల్లర్లు సిండికేట్‌గా మారి వరి ధాన్యం ధరలను తగ్గించి కొనుగోలు చేస్తూ రైతులను నష్టాలపాలు చేస్తున్నారని యువ రైతు ఇజాప రవీందర్, ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మూడ్ దయానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తహసీల్దార్ మల్లయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటకు సరైన గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. గత నెల రోజుల క్రితం క్వింటాల్ సన్న ధాన్యాన్ని రూ. 4 వేల నుంచి రూ. 4,500 వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు, ప్రస్తుతం సిండికేట్‌గా మారి రూ. 2,900 నుంచి రూ. 3,300 మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపించారు. ధర ఎందుకు తగ్గించారని రైతులు ప్రశ్నిస్తే మార్కెట్లో ధర ఇంతేనని సమాధానం చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడ కాంటాలు, హమాలీలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయని అన్నారు. ఇదే అదనుగా దళారులు తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు, హమాలీలను ఏర్పాటు చేసి, క్వింటాల్‌కు రూ. 4 వేల నుంచి రూ. 4,500 వరకు ధర కల్పిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని, మిల్లర్ల సిండికేట్‌పై చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని వారు అధికారులను కోరారు.