
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జహీరాబాద్, నవంబర్ 13: జహీరాబాద్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం అన్నారు. జహీరాబాద్ కు రోజుకు సుమారు 40 ఎంఎల్డీ (4 కోట్ల లీటర్లు) తాగునీరు అవసరం. ప్రస్తుతం బుసిరెడ్డిపల్లి, రాఘవాపూర్, పాంపాడ్ ప్రాంతాల నుంచి సింగూరు జలాశయం ఆధారంగా నీటి సరఫరా జరుగుతోంది. అయితే మరో 15-20 రోజుల్లో ఈ నీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని, ఆ తర్వాత భూగర్భ జలాలపైనే ఆధారపడాల్సి వస్తుందని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవకపోవడం ఒక కారణమైతే, సింగూరు జలాశయంలోని నీటిని ముందస్తు ప్రణాళిక లేకుండా ఖాళీ చేయడం, గోదావరి జలాలను సకాలంలో ఎత్తిపోసుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. దాదాపు 850 టీఎంసీల గోదావరి జలాలు వృథాగా దిగువకు వెళ్లిపోయాయని, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జహీరాబాద్ లోని అలానా, హాట్సన్ తదితర ప్రధాన పరిశ్రమలకు రోజుకు సుమారు 3 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నట్లు అంచనా. ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడే పరిస్థితుల్లో పరిశ్రమలకు నీటి సరఫరాను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆ పరిశ్రమలు వినియోగిస్తున్న బోర్లపై సమగ్ర విచారణ జరిపి, అవసరమైతే చట్టప్రకారం స్వాధీనం చేసుకుని ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించాలన్నారు. ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, పరిశ్రమల ప్రయోజనాల కంటే ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం, తాగునీటి అవసరాలకే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నీరు సమృద్ధిగా ఉన్న బోర్లను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని కోరారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని చర్యలు చేపట్టకపోతే జహీరాబాద్ ప్రజలు తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామచంద్రా రెడ్డి, శివకుమార్, ఎం.డి. సలీం, కీరు తదితరులు పాల్గొన్నారు.