
ప్రజా అవసరాలకు ఉపయోగపడే భూములను విక్రయించే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? జనం న్యూస్ నవంబర్ 13 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి భూముల విక్రయాలను నిలిపివేయకపోతే సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతాం – మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. మాజీ మంత్రి హరీష్ రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ. కూకట్పల్లి నియోజకవర్గంలోని కూకట్పల్లి మూసాపేట ట్రక్ పార్క్ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేయడానికి సిద్ధం కావడాన్ని నిరసిస్తూ శుక్రవారం ట్రక్ పార్క్ వద్ద ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో భారీ ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు, ఎమ్మెల్యే వివేక్ , ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ , శంబిపూర్ రాజు హాజరై ప్రభుత్వ భూముల విక్రయాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో కూకట్పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు, సీపీఐ, సీపీఎం నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ. మూసాపేట ట్రక్ పార్క్‌కు సంబంధించిన భూములను కేవలం ప్రజా అవసరాల కోసమే వినియోగించాలని, వాణిజ్య అవసరాలకు, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి లేదా ఇతర కమర్షియల్ కార్యకలాపాలకు ఉపయోగించకూడదని చట్టంలోనే స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటి నిబంధనలను ఉల్లంఘిస్తూ భూములను విక్రయించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నించడం చట్టవ్యతిరేకమని ఆక్షేపించారు. ప్రజల అవసరాల కోసం కేటాయించిన భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మకానికి పెట్టారని, మిగిలిన భూములను సైతం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో తనఖా పెట్టి నిధులు సమీకరించి ఢిల్లీకి పంపాలని చూస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర సంపదను అమ్ముకుంటూ భవిష్యత్ తరాలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా వివిధ ప్రభుత్వాల హయాంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ భూములను కాపాడుకుంటూ వచ్చారని, అలాంటి విలువైన భూములను ఇప్పుడు అమ్మకానికి పెట్టడం దురదృష్టకరమన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న హౌసింగ్ బోర్డు స్థలాలు, 200 గజాల స్థలాలు, పార్కులు, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, బొందలగడ్డ వంటి ప్రాంతాలను కూడా అమ్ముకునే పరిస్థితికి తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. కూకట్పల్లి ప్రాంతంలో భవిష్యత్తులో జనాభా దాదాపు 25 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని, ఇప్పటికే పెద్ద ఎత్తున హైరైజ్ భవనాలు నిర్మితమయ్యాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు పార్కులు, క్రీడా మైదానాలు, పార్కింగ్ స్థలాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వ భూములు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్న భూములను కూడా అమ్ముకుంటే భవిష్యత్ తరాలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి స్థలం ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. మూసాపేట ట్రక్ పార్క్ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించడానికి వీల్లేదని, ప్రభుత్వం వెంటనే వేలం ప్రక్రియను నిలిపివేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ భూములను కాపాడుకోవడం కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. కూకట్పల్లి ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రజలకు ఉపయోగపడాల్సిన భూములను విక్రయించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను భవిష్యత్ తరాలకు ఆస్తిగా అందించాలే తప్ప, వాటిని వేలం వేసి విక్రయించడం సరికాదన్నారు. ప్రజల ఆస్తులను, ప్రభుత్వ భూములను కాపాడే వరకు తమ పోరాటం ఆగదని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ ,ఎమ్మెల్సీ నవీన్ కుమార్, శంబిపూర్ రాజు, బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరా, మాజీ కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, ముద్దం నరసింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, తూము శ్రావణ్ కుమార్, పగడాల బాబురావు, మందాడి శ్రీనివాసరావు, సతీష్ గౌడ్, సబిహా గౌసుద్దీన్, మహేశ్వరీ శ్రీహరి, డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సీపీఐ నాయకులు సత్యం, సీపీఎం నాయకులు కృష్ణా, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.