
జనం న్యూస్ నవంబర్ 18: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా మరో ముందడుగు పడింది. కీర్తిశేషులు శ్రీ లక్ష్మయ్య, శ్రీమతి కంటం లస్మవ్వ మొగిలిపేట గార్ల జ్ఞాపకార్థం వారి వారసులైన కంటం గణేష్, కంటం నరేష్‌లు గ్రామంలోని శ్రీ రామాలయ మందిరం ఎదుట మినీ బస్ స్టేషన్ నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. తమ పెద్దల జ్ఞాపకార్థం గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా మినీ బస్ స్టేషన్ నిర్మాణానికి ముందుకు రావడం పట్ల కంటం కుటుంబ సభ్యులను గ్రామస్తులు అభినందించారు. ఈ నిర్మాణం పూర్తయితే బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులకు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాళ్లరాంపూర్ ఇన్చార్జి సర్పంచ్ చాట్ల జనార్దన్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో దాతల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. తమ పెద్దల జ్ఞాపకార్థం ప్రజలకు ఉపయోగపడే నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కంటం కుటుంబ సభ్యులను అభినందించారు. గ్రామంలో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి మేలు చేయడమే కాకుండా భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సోమదేవారెడ్డి, శ్రీ రామాలయ కమిటీ అధ్యక్షుడు భీమానావోయినా పెద్ద బావులు, కమిటీ సభ్యులు బక్కూరి సాగర్ మరియు శ్రీ రామాలయం అర్చకులు దోమకొండ విష్ణు శర్మ తుమ్మల ఆనంద్, పోతుగంటి దేవన్న, సాయిరాం పాల్గొన్నారు.