
ట్రస్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డీజీ వీసీ సజ్జనార్ ఐపీఎస్మె ట్ పల్లి యువకుడు ఎనుగందుల ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో 3,000 మందికి పైగా స్వచ్ఛంద సేవకులతో సామాజిక సేవా కార్యక్రమాలు జనం న్యూస్, నవంబర్ 20, జగిత్యాల జిల్లా, మెట్పల్లి: ఎన్నో సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ, యువతలో సేవా భావాన్ని పెంపొందిస్తూ ముందుకు సాగుతున్న మెట్పల్లి పట్టణానికి చెందిన యువకుడు ఎనుగందుల ఉదయ్ కుమార్ తన మిత్రులతో కలిసి సంజీవని వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టనున్న వివిధ సేవా కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను హైదరాబాద్‌లో తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన, అత్యవసర సేవలు మరియు పౌర రక్షణ విభాగం డీజీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. సమాజంలోని వివిధ వర్గాలకు సేవలందించాలనే సంకల్పంతో ఏర్పాటైన ఈ ట్రస్ట్ ద్వారా 3,000 మందికి పైగా స్వచ్ఛంద సేవకులను భాగస్వాములుగా చేసుకొని, విద్య, వైద్యం, ఉపాధి, జీవనోపాధి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రక్షణ, రవాణా, అటవీ మరియు వన్యప్రాణుల సంరక్షణ, వ్యవసాయం తదితర రంగాల్లో 200కు పైగా సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు తాము ఇప్పటివరకు చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి వీసీ సజ్జనార్‌కు వివరించారు. సేవా కార్యక్రమాల వివరాలను ఆసక్తిగా తెలుసుకున్న ఆయన, యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావడం అభినందనీయమని ప్రశంసించారు. సమాజ అభ్యున్నతికి స్వచ్ఛంద సంస్థలు, యువత చేస్తున్న కృషి ఎంతో కీలకమని పేర్కొంటూ ట్రస్ట్ సభ్యులను అభినందించారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎనుగందుల ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, ట్రస్ట్ పోస్టర్ ఆవిష్కరణకు తన విలువైన సమయాన్ని కేటాయించి, తమ సేవా కార్యక్రమాలను తెలుసుకొని అభినందించిన వీసీ సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఇప్పటివరకు ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమాలకు సహకరించిన స్వచ్ఛంద సేవకులు, మిత్రులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవని వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎనుగందుల ఉదయ్ కుమార్, గుంటుక సాగర్, శ్రీరాముల మహేష్, కటుకం శివ కుమార్, రాచర్ల వివేక్, మగ్గిడి రవి కుమార్, హిమాన్షు, మన్మత్ తదితరులు పాల్గొన్నారు.