
డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకల్లో భాగంగా స్వేరోస్ నెట్వర్క్ సేవా కార్యక్రమం. జనం న్యూస్ 23 నవంబర్ వికారాబాద్ జిల్లా :- జ్ఞాన యోధుడు, స్వేరోస్ నెట్వర్క్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతిజ్ఞ దివస్ సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వేరోస్ నెట్వర్క్ నాయకులు లక్నాపూర్ శ్రీనివాస్ గారి నేతృత్వంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, బాలింతలకు, డయాలసిస్ చేయించుకుంటున్న పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తూ, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం ద్వారా మానవత్వం, సేవాభావం, సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా స్వేరోస్ ప్రతిజ్ఞ దివస్ యొక్క ముఖ్య ఉద్దేశాలను నాయకులు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ నిత్యజీవితంలో నిజాయితీగా ఉండాలని, అబద్ధాలకు దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు బానిసలు కాకూడదని, ధూమపానం వంటి ఆరోగ్యానికి హానికరమైన అలవాట్లకు దూరంగా ఉంటూ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. పరిగి మండలంలోని బర్కత్ పల్లి మరియు లక్నాపూర్ గ్రామాలలో విద్యార్థులు మరియు యువత పాల్గొని బర్త్డే సందర్భంగా కేకులు, మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యను జీవితంలో అత్యంత ప్రధాన లక్ష్యంగా స్వీకరించి, నిరంతరం చదువుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. స్వేరోస్ ఉద్యమం ప్రధానంగా అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మాభిమానం అనే నాలుగు కీలక సూత్రాల ఆధారంగా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తోందని పేర్కొన్నారు. విద్య ద్వారా జ్ఞానాన్ని, ఆరోగ్యం ద్వారా శక్తిని, ఆర్థిక స్వావలంబన ద్వారా గౌరవప్రదమైన జీవితాన్ని, ఆత్మాభిమానం ద్వారా సమాజంలో సమాన గౌరవాన్ని సాధించాలన్నదే స్వేరోస్ నెట్వర్క్ లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావం, విద్య అనే మార్గాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్థాపించిన స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఆయన జన్మదినాన్ని కేవలం వేడుకగా కాకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్వేరోస్ సభ్యులు ప్రతిజ్ఞ దివస్ సందర్భంగా ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పరిగి డిపో ఆర్టీసీ గౌరవాధ్యక్షులు పెంటన్న, దేవినేని వెంకటయ్య, స్వేరోస్ జిల్లా కోశాధికారి నరేందర్, స్వేరోస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాబు, స్వేరోస్ ఉపాధ్యక్షులు బాపురం నర్సింలు, ఉపాధ్యాయులు జాఫర్పల్లి వెంకటయ్య, బుచ్చన్న, నర్సింలు, గట్పల్లి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.