
జనం న్యూస్ నవంబర్ 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు కూకట్పల్లిలోని హుడా ట్రక్ పార్క్ భూములు, హౌసింగ్ బోర్డు భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ వేలం వేయకుండా ప్రజా అవసరాలకే వినియోగించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గత కొన్ని రోజులుగా నిరసన దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ భూములను పార్కులు, ఆటస్థలాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించాలని, భవిష్యత్ తరాలకు అవసరమైన భూములను అమ్ముకుంటూ పోతే రాబోయే తరాల భవిష్యత్తు అంధకారమవుతుందని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకుండా భూముల వేలం ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజల కోసం పోరాడుతున్న తమ గొంతును ఎన్ని విధాలుగా నొక్కినా ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ పోతే ప్రజలు ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.