
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 27. తర్లుపాడు మండలంలోని అన్ని పాఠశాలలకు రూ.20 వేల విలువైన ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందజేత సేవా కార్యక్రమాలతో తన జన్మదినాన్ని సార్థకం చేసుకుంటూ ఉపాధ్యాయుడు కశెట్టి జగన్ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన జన్మదినం సందర్భంగా తర్లుపాడు మండలంలోని అన్ని పాఠశాలలకు సుమారు రూ.20 వేల విలువైన ఫస్ట్ ఎయిడ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లలో విద్యార్థులకు అత్యవసర సమయాల్లో ఉపయోగపడే 13 రకాల వైద్య సామగ్రితో పాటు, ఉపాధ్యాయులకు గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే మూడు రకాల మందులను ఏర్పాటు చేశారు.జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ కె. రాహుల్, డాక్టర్ వెంకటేశ్వర నాయక్ చేతుల మీదుగా ఫస్ట్ ఎయిడ్ కిట్లను ప్రారంభించి, మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. నిత్యం సమాజ సేవలో ముందుండే జగన్ సేవలను కొనియాడారు. ఉపాధ్యాయులు సైతం ఈ కార్యక్రమాన్ని గొప్ప సేవగా అభివర్ణిస్తూ, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్-2 చైర్మన్ శ్రీ రామకృష్ణారావు, లయన్స్ క్లబ్ సభ్యులు కిరణ్ కుమార్, అన్న ఆంజనేయులు, ఎం.వి. రమణ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్లను మార్కాపురం లయన్స్ క్లబ్ అధ్యక్షులు కశెట్టి జగన్ బాబు, పెరుమాళ్ల బాలమోహన్ రావు దాతలుగా అందించారు. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని పలువురు ఆకాంక్షించారు.