
నాగేంద్రనగర్లో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన సర్పంచ్జ నం న్యూస్ సెప్టెంబర్ 22: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని నాగేంద్రనగర్ గ్రామ పంచాయతీ స్వచ్ఛతా హీ సేవా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సందె రంజిత్ విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో వివిధ రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించడంతో పాటు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణం అందుతుందని తెలిపారు. నాటిన మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల పరిసరాలు, గ్రామంలోని ప్రధాన ప్రాంతాల్లో పరిశుభ్రత పాటిస్తూ చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు. చిన్న వయస్సు నుంచే విద్యార్థుల్లో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తే సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. “స్వచ్ఛతే సేవ.. పచ్చదనం మన బాధ్యత” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.