
జనం న్యూస్ --సెప్టెంబర్ 23- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ లో కొత్త బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనాల సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కే రాహుల్ బుధవారం సాయంత్రం సందర్శించి తనిఖీ చేశారు. వినాయక నిమజ్జనాల కోసం సాగర్ వస్తున్న భక్తుల సౌకర్యార్థం కొత్త బ్రిడ్జి వద్ద ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో అందుబాటులో ఉంచిన మందులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిమజ్జనాలు జరుగుతున్న ప్రదేశాలలో వైద్య పరంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సంబంధిత మందులతో తమ సిబ్బందితో 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు. వినాయక నిమజ్జనాలు జరిగే ప్రదేశాలలో అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్‌లను సిబ్బందితో సహా అందుబాటులో వుండే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వీరితోపాటు జిల్లా వైద్య ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నగేష్, నాగార్జునసాగర్ బస్తీధవాఖానా డాక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.