
జనం న్యూస్ అక్టోబర్ 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక – బండి రమేష్ బాలానగర్ డివిజన్లో శనివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కూకట్పల్లి ఏఎంసీ డైరెక్టర్ కొండకింది పుష్పారెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీకాంత్ పటేల్, బాలానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాలకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ వేడుకలకు బాలానగర్ పరిసర ప్రాంతాల నుంచి మహిళలు, ఆడపడుచులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు సంప్రదాయ ఇందిరమ్మ చీరలు ధరించి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళలు తమ ఇళ్ల నుంచి రంగురంగుల తీరొక్క పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను తీసుకొని డప్పుల మోతలు, కోలాహలం మధ్య దుర్గామాత ఆలయ ప్రాంగణానికి ఊరేగింపుగా చేరుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో బతుకమ్మలను మధ్యలో ఉంచి, వాటి చుట్టూ తిరుగుతూ సంప్రదాయ బతుకమ్మ పాటలను ఆలపించారు. “చిత్తు చిత్తుల బొమ్మ, శివుడి ముద్దుల గుమ్మా, మా తల్లి బతుకమ్మ” అంటూ మహిళలు శ్రావ్యంగా పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. దీంతో బాలానగర్ ప్రాంతమంతా పండుగ శోభను సంతరించుకుంది.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ...తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని, ప్రకృతిని ఆరాధిస్తూ పూలతో పండుగ జరుపుకోవడం మన తెలంగాణ ప్రత్యేకత అని అన్నారు. బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ఆడపడుచుల ఆత్మగౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న మన సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.తెలంగాణ ఆడపడుచులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల మధ్య సోదరభావాన్ని, ఐక్యతను మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.
ఈ వేడుకలను ఘనంగా నిర్వహించిన నిర్వాహకులను బండి రమేష్ గారు అభినందించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేశారు.