
కంపెనీల యాజమాన్యాల తీరుపై కార్మికుల ఆవేదన
జనం న్యూస్, నవంబర్ 12, అచ్యుతాపురం:నవంబర్ 5న జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 135బి ప్రకారం వేతనంతో కూడిన సెలవు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, కొన్ని కంపెనీల యాజమాన్యాలు సాధారణ సెలవు మాత్రమే ప్రకటించాయని ఉద్యోగులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆ సెలవుకు బదులుగా నవంబర్ 15వ తేదీన ఆదివారం విధులకు హాజరు కావాలని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ పరిధిలోని బ్రాండిక్స్ ఇండియా ఆపెరల్ సిటీ జోన్లో ఉన్న కొన్ని కంపెనీల యాజమాన్యాలు నవంబర్ 11వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మైక్ ద్వారా ప్రకటించినట్లు ఉద్యోగులు తెలిపారు. సాధారణంగా ఆదివారం సెలవు దినం కావడంతో, ఎన్నికల పోలింగ్ సెలవుకు బదులుగా ఆదివారం విధులకు రావాలని ఆదేశించడం పట్ల కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి, అచ్యుతాపురం సెజ్ పరిధిలోని కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు ఆదివారం సెలవు ప్రకటించేలా ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు,కార్మికులు స్థానికులు కోరుతున్నారు.